మీ డ‌బ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుందో తెలుసా?

ఐదేళ్ల‌లో మీ డబ్బు రెట్టింపు కావాలంటే, 14.4 శాతం వార్షిక రాబ‌డినిచ్చే పెట్టుబ‌డి మార్గాల‌ను ఎంచుకోవాలి

మీ డ‌బ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుందో తెలుసా?

సాధ్య‌మైనంత త‌క్కువ వ్య‌వ‌ధిలో ఎక్కువ రాబ‌డి పొందాల‌నే పెట్టుబ‌డులు పెట్టే ప్ర‌తీ ఒక్కరు కోరుకుంటారు. అయితే మీరు చేసే పెట్టుబ‌డులు ఎంత‌కాలంలో రెట్టింపు అవుతాయ‌నేది, వాటిపై వ‌చ్చే రాబ‌డి\వ‌డ్డీ రేటుపై ఆధార‌ప‌డి ఉంటుంది. వ‌డ్డీరేటు/ రాబ‌డి ఎక్కువ వుంటే, డ‌బ్బు రెట్టింపు అయ్యేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు. మ‌రి మీ పెట్టుబ‌డులు రెట్టింపు అయ్యేందుకు ఎంత కాలం ప‌డుతుందో, ఏవిధంగా లెక్కించాలో మీకు తెలుసా? ఇందుకు ఒక సుల‌భ‌మార్గం ఉంది. అదే ‘ది రూల్ ఆఫ్ 72’. ఈ ఫార్ములాను ఉపయోగించి మీ డ‌బ్బు ఎంత‌కాలానికి రెట్టింపు అవుతుందో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

ఈ సూత్రంలో 72 అనే సంఖ్య‌ను మీ పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే వ‌డ్డీ రేటుతో విభ‌జించగా వ‌చ్చే నిర్ధిష్ట సంఖ్య మీ డ‌బ్బు ఎంత కాలానికి రెట్టింపు అవుతుందో తెలియ‌జేస్తుంది… ఉదాహ‌ర‌ణకి, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌లో వార్షిక‌ వ‌డ్డీ రేటు 5 శాతంగా ఉంటే, ఎఫ్‌డీ చేసిన మొత్తం రెట్టింపు అయ్యేందుకు సుమారు 14 సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌డుతుంది.

ఈ ఫార్ములాని ఈ కింది విధంగా వర్తింప‌చేయాలి.
రూల్ ఆఫ్ 72
72/5 = 14.4 సంత్స‌రాలు

మీ డ‌బ్బు నిర్ధిష్ట స‌మ‌యంలో రెట్టింపు కావాల‌నుకుంటే, పెట్టుబ‌డులపై ఎంత రాబ‌డి పొందాలో ఇప్పుడు చూద్దాం:

పైన తెలిపిన సూత్రాన్ని ఉప‌యోగించి, మీ డబ్బును ఒక నిర్దిష్ట వ్యవధిలో రెట్టింపు చేసేందుకు అవసరమైన రాబడిని లెక్కించ‌వ‌చ్చు. మీ డబ్బు మూడు సంవత్సరాలలో రెట్టింపు కావాలంటే, ప్ర‌తీ సంవ‌త్స‌రం 21 శాతం నుంచి 24 శాతం(72/3 సంవత్సరాలు) మేర రాబ‌డినిచ్చే పెట్టుబ‌డి మార్గాల‌ను ఎంచుకోవాలి. అదేవింగా, మీ డబ్బు ఐదేళ్ల‌లో రెట్టింపు కావాలంటే, 14.4 శాతం(72/5 సంవత్సరాలు) వార్షిక రాబ‌డి వుండే పెట్టుబ‌డి మార్గాల‌ను ఎంచుకోవాలి. 10 సంవ‌త్స‌రాల‌లో, పెట్టుబ‌డి రెట్టింపు అవ్వ‌డం మీ ల‌క్ష్యం అయితే, 7 శాతం వ‌డ్డీనిచ్చే ప‌థ‌కాల‌ను ఎంచుకోవాలి. రూల్ ఆఫ్ 72 ద్వారా మీరు ఎంచుకున్న ప‌థ‌కం ఇచ్చే వ‌డ్డీ రేటు ఆధారంగా మీ ల‌క్ష్యం చేరుకునేందుకు ఎన్ని సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌డుతుందో తెలుసుకోవ‌చ్చు.

ప్ర‌స్తుత వ‌డ్డీ రేట్ల ఆధారంగా, పీపీఎఫ్‌, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌, కేవీపీ, ఎన్ఎస్‌సీ, ఎన్‌పీఎస్, మ్యూచువ‌ల్ ఫండ్ వంటి వాటిలో పెట్టుబ‌డులు రెట్టింపు అయ్యేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంతో తెలుసుకుందాం.

పీపీఎఫ్‌: ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 7.1 శాతంగా ఉన్నందున, పెట్టుబ‌డులు రెట్టింపు అయ్యేందుకు సుమారు 10 సంవ‌త్స‌రాల(72\7.1=10.14) స‌మ‌యం ప‌డుతుంది.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న: ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 7.6 శాతం ప్ర‌కారం 9.4 సంవ‌త్స‌రాల‌లో పెట్టుబ‌డులు రెట్టింపు అవుతాయి.

కేవీపీ: వార్షిక వ‌డ్డీరేటు 6.9 శాతం. కావున డ‌బ్బు రెట్టింపు అయ్యేందుకు 10.4 సంత్స‌రాలు ప‌డుతుంది.

ఎన్‌పీఎస్: టైర్‌II ఖాతా స్కీమ్ సీ, స్కీమ్ జీలు ఏడాదికి స‌గ‌టున 11.5 శాతం రాబ‌డిని ఇస్తున్నాయి. ఇదే ప‌నితీరు క‌న‌బ‌రిస్తే 6.2 సంవ‌త్స‌రాల‌లో మీ పెట్టుబ‌డులు రెట్టింపు అవుతాయి.

మ్యూచ్‌వ‌ల్ ఫండ్లు: స్వల్పకాలిక మ్యూచువల్ ఫండ్‌లు, డైనమిక్ బాండ్ ఫండ్‌లు గత సంవత్సరం సుమారు 8.5శాతం రాబడిని అందించాయి. భ‌విష్య‌త్తులో కూడా ఇదే రాబడిని కొన‌సాగిస్తే , పెట్టుబడులు రెట్టింప‌య్యేందుకు 8.4 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా మ‌ధ్య‌, దీర్ఘ‌కాలిక మ్యూచువ‌ల్ ఫండ్ల వార్షిక ఆదాయం గ‌త ఏడాది 8.7 శాతంగా ఉంది. ఇదే రాబ‌డిని భ‌విష్య‌త్తులో అంచ‌నా వేస్తే మీ డ‌బ్బు రెట్టింపు అయ్యేందుకు 8.3 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly