ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీని ఎవ‌రు ఎంచుకోవాలి?

మీరు, మీ కుటుంబ స‌భ్యుల కోసం ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకోవాలి అనుకుంటున్నారా?

ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీని ఎవ‌రు ఎంచుకోవాలి?

వైద్య ఖ‌ర్చులు రోజురోజుకి పెరుగుతున్న‌ ప‌్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో ఆరోగ్య బీమా చాలా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. కుటుంబంలోని ప్ర‌తి వ్య‌క్తి ఆరోగ్య బీమాను క‌లిగి వుండ‌డం ఎంతో అవ‌సరం. అందుకోసం బీమా సంస్ధ‌లు చాలా ర‌కాలైన బీమా పాల‌సీల‌ను అందుబాటులో వుంచాయి. అందులో ఫ్యామిలీ ప్లోట‌ర్ పాల‌సీ ఒక‌టి.

ఫ్యామిలీ ఫ్లోట‌ర్‌ పాల‌సీ అంటే ఏమిటి? ఇది ఏవిధంగా ప్ర‌యోజ‌న‌కరం?

కుటుంబంలోని స‌భ్యులంద‌రిని ఒక యూనిట్‌గా ప‌రిగ‌ణించి ఇచ్చేదే ఫ్యామిలి ప్లోట‌ర్ పాల‌సీ. కుటుంబంలో ఉన్న స‌భ్యుల మీదఆధార‌ప‌డి వివిధ ఫ్యామిలీ ప్లోట‌ర్ పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. పాల‌సీ తీసుకునే వ్య‌క్తి, అత‌ని భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు, అత‌ని త‌ల్లితండ్రులు, నాన‌మ్మ తాత‌య్య‌లు అంద‌రికి క‌లిపి ఈ ఫ్యామిలీ ప్లోట‌ర్ పాల‌సీని తీసుకోవ‌చ్చు. సాదార‌ణ ఆరోగ్య బీమా మాదిరిగానే అన్ని ప్ర‌యోజ‌నాలు, మిన‌హాయింపులు దీనికి వ‌ర్తిస్తాయి. కాని వ్య‌త్యాసం ఏమిటంటే ఫ్యామిలి మొత్తాన్ని ఒకే యూనిట్‌గా ప‌రిగ‌ణించ‌డం వ‌ల్ల కుటుంబంలోని ఒక స‌భ్యుడు పాల‌సీ క్లెయిమ్ చేసిన అనంత‌రం మిగిలిన కుటుంబానికి బీమా క‌వ‌ర్ త‌గ్గుతుంది. పాల‌సీ తీసుకున్న స‌భ్యుడు మ‌ర‌ణిస్తే పాల‌సీ వేరొక‌రి పేరు మీద బ‌ద‌లీ చేసుకోవ‌ల‌సి ఉంటుంది. త‌రువాత సంవ‌త్స‌రం ప్రీమియం మిగిలిన కుటుంబ స‌భ్యుల ఆధారంగా నిర్ణ‌యిస్తారు.

ఈ ఫ్యామిలీ ప్లొట‌ర్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల త‌క్కువ‌ ఖ‌ర్చుతో కుటుంబ స‌భ్యులంద‌రికి బీమా క‌వ‌ర్‌ను అందించ‌వ‌చ్చు. అయితే కుటుంబంలో పెద్ద వ‌య‌స్సు ఉన్న స‌భ్యుని దృష్టిలో వుంచుకుని ప్రీమియంని విధిస్తారు. కాబ‌ట్టి చిన్న కుటుంబం ఉన్న వారు ఈ పాల‌సీ ద్వారా అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కి అమిత్ అనే వ్యాపారం చేసుకునే వ్య‌క్తికి 37 సంవ‌త్స‌రాలు. అత‌నికి ఇద్ద‌రు పిల్లలు. అత‌ను త‌న తల్లిదండ్రుల‌తో క‌లిసి జీవిస్తున్నాడు. అత‌ని త‌ల్లిదండ్రులు ఉభ‌యుల‌కు డ‌యాబెటిస్‌. అమిత్ త‌న డ‌యాబెటిక్ త‌ల్లిదండ్రుల కోస‌మే కాకుండా మొత్తం కుటుంబం కోసం ఆరోగ్య బీమాను తీసుకోవాల‌నుకుంటున్నాడు. ప్ర‌స్తుతం త‌న కుటుంబం ఆరోగ్యంగా వుండ‌వ‌చ్చు. కాని భ‌విష్య‌త్తులో వ‌చ్చే వైద్య ప‌ర‌మైన ఖ‌ర్చులను అధిగమించ‌డం కోసం ఆరోగ్య బీమా అవ‌సరం అని భావిస్తున్నాడు.

అమిత్ ఇప్పుడు ఎలాంటి పాల‌సీని ఎంచుకోవాలి? కుటుంబ స‌భ్యులంద‌రిని క‌వ‌ర్ చేసే ఫ్యామిలీ ప్లోట‌ర్ పాల‌సీ మంచిదా లేదా విడివిడిగా ఆరోగ్య తీసుకోవ‌డం మంచిదా?

ఫ‌్యామిలీ ప్లోట‌ర్ బీమా పాల‌సీ త‌క్కువ ఖ‌ర్చుతో కుటుంబ సభ్యులంద‌రిని క‌వ‌ర్ చేస్తూ బీమా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్న‌ప్ప‌టి, చెల్లించ‌వ‌ల‌సిన ప్రీమియం కుటుంబంలోని పెద్ద వ‌య‌స్సు క‌లిగిన స‌భ్యుడు అన‌గా, అమిత్ తండ్రి వ‌య‌స్సు, ఆరోగ్య ప‌రిస్థితుల ఆధారంగా నిర్ణ‌యిస్తారు కాబ‌ట్టి ప్రీమియం అధికంగా వుంటుంది.
కాబ‌ట్టి అమిత్ త‌న త‌ల్లిదండ్రుల కోసం వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా ప్ర‌త్యేకంగా ఆరోగ్య‌ బీమాను కొనుగోలు చేయ‌డం మంచిది. అత‌ను, అత‌ని భార్య ఇద్ద‌రు పిల్ల‌ల కోసం ఫ్యామిలి ప్లోట‌ర్ పాల‌సీని కొనుగోలు చేయ‌డం ద్వారా అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly