పెట్టుబ‌డుల‌ను ఎలా స‌మీక్షించుకోవాలి?

పెట్టుబ‌డి చేసేముందు ఏవిధ‌మైన శ్ర‌ద్ధ తీసుకుంటామో అదే విధంగా వాటిని అప్పుడ‌ప్పుడు స‌మీక్షించుకుంటూ ఉండాలి.

పెట్టుబ‌డుల‌ను ఎలా స‌మీక్షించుకోవాలి?

క్ర‌మంగా మ‌దుపుచేసే అల‌వాటు ఉంటే పెట్టుబ‌డుల విలువ‌ త‌గ్గిన‌పుడు కూడా మ‌దుపు చేసే అవ‌కాశం ఉంటుంది. అస్థిర‌త ప్ర‌భావంతో ధ‌ర త‌గ్గిన సంద‌ర్భంలో మ‌దుప‌ర్లు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపుచేస్తుంటారు. ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం పెట్టుబ‌డి చేయ‌డం అప్పుడ‌ప్పుడు పెట్టుబ‌డుల‌ను స‌మీక్షించుకోవ‌డం అంతే ముఖ్యం. మార్కెట్లో మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పెట్టుబ‌డుల‌ను స‌ర్దుబాటు చేసుకోవ‌డం పై కూడా దృష్టి సారించాలి.

పెట్టుబ‌డి చేసేముందు అనేక విధాలుగా ఆలోచిస్తుంటాం. ఇదే విధంగా వాటిని ప‌రిశీలించ‌డంపై కూడా శ్ర‌ద్ధ పెట్టాలి. గ‌త కొంత‌కాలంగా వృద్ధి చెంద‌ని పెట్టుబ‌డిని గుర్తించి విక్ర‌యించ‌డం మంచిది. లేదంటే వాటి ప్ర‌భావం మొత్తం పోర్టుఫోలియోపై ప‌డి విలువ త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. పోర్టుఫోలియో ప‌నితీరును మ‌దింపుచేసేందుకు ఒక విధానం ఎంచుకోవాలి. దానికి స‌మాన‌మైన పెట్టుబ‌డి సాధ‌నాల‌తో గానీ, ఏదైనా సూచీతో గానీ పోల్చిచూసుకోవాలి.

ల‌క్ష్యానికి అనుగుణంగా:

మ‌దుప‌రి త‌న ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పోర్టుఫోలియోలో ఆస్తుల కేటాయింపులు చేసుకుంటారు. కాల‌క్ర‌మేణ ఆ కేటాయింపులు మారి న‌ష్ట‌భ‌యం పెరిగే అవ‌కాశం ఉంటుంది. అదెలా అంటే మ‌దుప‌రి పెట్టుబ‌డుల్లో ఈక్విటీ భాగం విలువ పెరిగింద‌నుకుందాం. అప్పుడు పోర్టిఫోలియోలో ఈక్విటీ శాతం అధికంగా డెట్ శాతం త‌క్కువ‌గా మారుతుంది. అలాంటి స‌మ‌యాల్లో వెంట‌నే పెరిగిన ఈక్విటీ పెట్టుబ‌డిని విక్ర‌యించి , అందుకు స‌రిపోయే డెట్ లో పెట్టుబ‌డి చేసి పోర్టుఫోలియోను స‌ర్దుబాటు చేసుకోవాలి. ఇలా చేయ‌డం ద్వారా న‌ష్ట‌భ‌యాన్ని మ‌నం కోరుకున్న విధంగా ఉంచుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక మ‌దుప‌రి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసేందుకు ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌నుకుందాం. అత‌ని పోర్టుఫోలియోలో ఈక్విటీ విలువ పెరిగి మొత్తం ఆస్తుల్లో డెట్ ప‌రిమాణం శాతం త‌గ్గింద‌నుకుందాం. అప్పుడు ఆ మ‌దుప‌రి త‌న‌కు అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ భాగం ఈక్విటీ పెట్టుబ‌డులు క‌లిగి ఉంటాడు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే ఉద్యోగికి ఆ న‌ష్ట‌భ‌యం అధిక‌మ‌వుతుంది. పెరిగిన ఈక్విటీని విక్ర‌యించి త‌గ్గిన డెట్ లో పెట్టుబ‌డి చేయాలి.

ల‌క్ష్యాన్ని చేరిన‌పుడు:

పోర్టుఫోలియోను నిర్మించడంలో ప్ర‌ధాన ఉద్దేశ్యం మ‌దుప‌ర్లు త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకోవ‌డం. కాబ‌ట్టి ఆ ల‌క్ష్యాన్ని చేరుకున్న వెంట‌నే పెట్టుబ‌డి ఉప‌సంహ‌ర‌ణ చేయాలి. ఈ విధంగా చేయడం అటు మూల‌ధ‌న ర‌క్ష‌ణ‌కు, ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకునేందుకు రెండింటికి మేలు చేస్తుంది. దీర్ఘ‌కాలం పాటు మ‌దుపు చేసేవారు త‌మ పెట్టుబ‌డిని ల‌క్ష్యం స‌మీపిస్తున్న స‌మ‌యంలో కొంచెం ముందుగా అంటే ఒక‌టిరెండు సంవ‌త్స‌రాల ముందుగా ఉప‌సంహ‌రించి స్థిరాదాయ పెట్ట‌బ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేయాలి. అనంత‌రం ల‌క్ష్యానికి అవ‌స‌ర‌మైన నిధులను ఆ ప‌థ‌కాల నుంచి పెట్టుబ‌డిని ఉప‌సంహ‌రించుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly