ఇండెక్స్ ఫండ్లలో ఎందుకు మదుపుచేయాలి?

కొత్త‌గా మ్యూచువ‌ల్ ఫండ్లలో మ‌దుపు చేద్దామ‌ని అనుకునే వారు ఇండెక్స్ ఫండ్ల‌తో ప్రారంభించ‌వ‌చ్చు.

ఇండెక్స్ ఫండ్లలో ఎందుకు మదుపుచేయాలి?

మ్యూచువ‌ల్ ఫండ్లు వ‌చ్చినప్ప‌టి నుంచీ ఇండెక్స్ ఫండ్లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ ఈ మ‌ధ్య కాలంలోనే బాగా ఆద‌ర‌ణ పొందాయి. దీనికి ఒక‌ కార‌ణం మ్యూచువ‌ల్ ఫండ్ల కేట‌గిరైజేష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. ఫండ్ల కేట‌గిరైజేష‌న్ తో ఫండ్లు వాటి అసెట్ అలోకేష‌న్ కే ప‌రిమితమై ఉండాలి. అంటే లార్జ్ క్యాప్ ఫండ్లు అధిక రాబ‌డిని ఆర్జించే ఉద్దేశంతో ఇత‌ర మిడ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబ‌డి చేయ‌డం వీలు కాదు. రెండో కార‌ణం బెంచ్ మార్కింగ్ ప్ర‌స్తుతం టీఆర్ఐ ఆధారంగా మార‌డం. దీంతో ఫండ్ ప‌నితీరును పోల్చి చూసేందుకు కంపెనీల నుంచి ఫండ్ నిర్వాహ‌కులు పొందే డివిడెండ్లను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ఈ రెండు కార‌ణాల వ‌ల్ల ఇండెక్స్ ఫండ్ల‌కు ప్రాముఖ్య‌త పెరిగింద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇండెక్స్ ఫండ్ అంటే ఏదైనా ఒక ఇండెక్స్(సూచీ) ను అనుక‌రిస్తూ పెట్టుబ‌డిచేసే ఫండ్లు. ఇండెక్స్ ఫండ్ మేనేజ‌ర్ నిఫ్టీ లేదా సెన్సెక్స్ ఇండెక్స్ ల‌ను అనుక‌రిస్తూ పెట్టుబ‌డి చేస్తారు. ఇండెక్స్ ఫండ్లు ఆయా ఇండెక్స్ ల‌ను బెంచ్ మార్కుగా చేసుకుని, వాటికి అనుగుణంగా పెట్టుబ‌డి చేస్తాయి. అయితే క‌చ్చితంగా సూచీలో వ‌చ్చినంత రాబ‌డి ఇండెక్స్ ఫండ్ లో రాదు. కానీ ద‌గ్గ‌ర‌గా వ‌స్తుంది.

ఉదాహ‌ర‌ణ‌కు సెన్సెక్స్ రెండు సంవత్సరాల్లో 25 శాతం పెరిగినట్లయితే, సెన్సెక్స్ ఆధారిత‌ ఇండెక్స్ ఫండ్ లో దాదాపుగా అంతే పెరుగుదల కనిపిస్తుంది. ఇండెక్స్ ఫండ్ల‌లో ట్రాకింగ్ ఎర్ర‌ర్ కొంత‌ ఉత్పన్నమవుతుంది ఎందుకంటే ఇండెక్స్ ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు, మార్కెటింగ్ ఖర్చులు, లావాదేవి ఖర్చులు మొద‌లైన‌వి వ‌సూలు చేస్తాయి. దీంతో సెన్సెక్స్ ఒక నిర్దిష్ట కాలంలో 12 శాతం రాబ‌డి అందించిన‌పుడు,సెన్సెక్స్ ఆధారిత ఇండెక్స్ ఫండ్ 11 శాతం పెరుగుతుంది.

ఇండెక్స్ ఫండ్ల నిర్వ‌హ‌ణ రుసుం యాక్టివ్ ఫండ్ల కంటే త‌క్కువ‌గా ఉంటుంది. ఇండెక్స్ ఫండ్ల నిర్వాహ‌కులు ప్ర‌త్యేకంగా ఏవిధ‌మైన షేర్లను ఎంపిక చేయ‌డం, ప‌రిశోధ‌న లాంటివి లేకుండా, ఏదైనా ఒక ఇండెక్స్ అనుక‌రించి పెట్టుబ‌డులు చేస్తుంటారు కాబ‌ట్టి వీటిలో నిర్వ‌హ‌ణ రుసుం బాగా త‌గ్గుతుంది. ప్ర‌ధాన మార్కెట్ సూచీలైనా నిఫ్టీ, సెన్సెక్స్ సూచీల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఫండ్లలో చేసే పెట్టుబ‌డికి వైవిధ్య‌త‌ ఉంటుంది. స్వ‌ల్ప‌కాలానికి వీటిలో హెచ్చుత‌గ్గులు ఏర్ప‌డినా దీర్ఘ‌కాలంలో వీటిపై మంచి రాబ‌డి ని పొంద‌వ‌చ్చు.

కొత్త‌గా మ్యూచువ‌ల్ ఫండ్లలో మ‌దుపు చేద్దామ‌ని అనుకునే వారు ఇండెక్స్ ఫండ్ల‌తో ప్రారంభించ‌వ‌చ్చు. మార్కెట్ల ప‌ట్ల అంత అవ‌గాహ‌న‌ లేని వారు ఇండెక్స్ ఫండ్లను ఎంచుకోవ‌చ్చు. వీటి ద్వారా వివిధ ర‌కాల సెక్టార్లు, కంపెనీల్లో పెట్టుబ‌డి చేసే అవ‌కాశం ఉంటుంది. సిప్ విధానంలో కొంత మొత్తం చొప్పును ఇండెక్స్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌డం ద్వారా దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు.

ఇండెక్స్ ఫండ్లలో ప‌న్ను ఈక్విటీకి వ‌ర్తించిన విధంగా ఉంటుంది. ఒక సంవ‌త్స‌రం లోపు పెట్టుబ‌డి పై స్వ‌ల్ప‌కాలిక మూలధన ఆదాయానికి 15% ప‌న్ను ఉంటుంది. ఒక సంవ‌త్స‌రం త‌ర్వాత పెట్ట‌బ‌డి పై వ‌చ్చిన ఆదాయం దీర్ఘ‌కాలిక మూలధన ఆదాయం పై ప‌న్ను ఉండదు

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly