వినియోగానికి సిద్ధంగా ఉన్న గృహ కొనుగోలు ప్రయోజనాలు

ఒకవేళ మీరు ఇప్పుడు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని భావించినట్లైతే, మీకు అనేక ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి

వినియోగానికి సిద్ధంగా ఉన్న గృహ కొనుగోలు ప్రయోజనాలు

గత కొద్ది సంవత్సరాల క్రితం భారతదేశమంతటా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో వినియోగానికి సిద్ధంగా ఉన్న గృహాలు, నిర్మాణంలో ఉన్న గృహాల కొనుగోళ్లు చాలా వరకు తగ్గిపోయాయి. ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ లిజాస్ ఫోర్సస్ నివేదిక ప్రకారం, ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం చివరినాటికి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కత్తా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), పూణే నగరాల్లో అమ్ముడుపోని 9,45,964 యూనిట్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ త్రైమాసికంలో విక్రయాల వాల్యూమ్ ను పరిశీలిస్తే, ఈ జాబితాను క్లియర్ చేయడానికి 41 నెలల సమయం పడుతుందని నివేదిక తెలిపింది. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని భావించినట్లైతే, మీకు అనేక ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వినియోగానికి సిద్ధంగా ఉన్న గృహాలను ఎంచుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీ కోసం మేము కొన్ని ప్రయోజనాలను కింద తెలియచేశాము.

ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందనే భయం ఉండదు:

మీరు వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేసినట్లయితే, ప్రాజెక్ట్ ఆలస్యం వంటి పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారు. మీరు అపార్ట్మెంట్, ఇతర సౌకర్యాలను పూర్తి చేసే వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు.

రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ (ఆర్ఈఆర్ఏ) 2016 అమలులో ఉండడంతో, డెవలపర్లు సమయపాలనకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది, చాలామంది డెవలపర్లు తమ ప్రాజెక్టులు పూర్తి కావడానికి సుమారు 5 నుంచి 6 సంవత్సరాల సమయం పడుతుందని తమ అధికారిక వెబ్ సైట్ ల ద్వారా తెలియచేశారు. కానీ గతంలో డెవలపర్లు ఇచ్చిన గడువు కేవలం మూడు సంవత్సరాలు.

మరో మాటలో చెప్పాలంటే, ఇప్పటికే చాలా మంది డెవలపర్లు ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయాన్ని తెలియచేశారు. ఒకవేళ డెవలపర్లు పేర్కొన్న గడువు తేదీలోగా ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే, ఆర్ఈఆర్ఏ కింద పెనాల్టీ లేదా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

మీరు చూసినదాన్నే కొనుగోలు చేయండి:

మీరు వినియోగానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసేటప్పుడు మొత్తం స్థలం, గదుల పరిమాణం, అపార్ట్మెంట్ వ్యూ , నిర్మాణ నాణ్యత, సౌకర్యాల లభ్యత, వంటి వాటిని పరిశీలించండి. "ప్రాజెక్టు నాణ్యతను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. వినియోగానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ వలన ప్రయోజనం ఏమిటంటే, దాని నిర్మాణాన్ని, నాణ్యతను దగ్గరగా చూసే అవకాశం ఉంటుందని కుష్మాన్ & వేక్ఫీల్డ్ ఇండియా అధికారి, మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ జైన్ చెప్పారు.

అదే నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు, మీరు నమూనా ఫ్లాట్ల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, ఇది మిమల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది.

పొరుగువారి గురించి తెలుసుకోండి:

మీ పొరుగువారి గురించి, అలాగే సమీపంలోని మార్కెట్, పబ్లిక్ ఏరియాస్, పార్కులు, ఇతర ప్రాంతాలను కలిపే రహదారుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న అపార్ట్ మెంట్ లో మంచి సౌకర్యాలు, భద్రత, సత్ప్రవర్తన కలిగిన పొరుగు వారు, సమీపంలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నట్లయితే, కొనుగోలుదారుడికి సౌకర్యవంతగా ఉంటుందని నాయర్ తెలిపారు.

తక్షణమే ఇంటిలోకి ప్రవేశించండి:

మీరు వినియోగానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసిన వెంటనే దానిలోకి ప్రవేశించడం మంచిది. ఎందుకంటే బయట వేరే ఇంటిలో నివసిస్తూ దానికి అద్దెను చెల్లించడంతో పాటు అపార్ట్ మెంట్ కొనుగోలుకు తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంఐ లు రెండింటిని చెల్లించడం కొంచం కష్టంతో కూడుకుని విషయమని జైన్ చెప్పారు.

అద్దె ద్వారా ఆదాయం పొందండి:

ఒకవేళ మీరు కొత్త ఇంటిని కేవలం పెట్టుబడి ప్రణాళికలో భాగంగా కొనుగోలు చేసి, దానిలోకి వెళ్లాలని భావించకపోతే, దానిని వీలైనంత త్వరగా అద్దెకు ఇచ్చి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఆదాయంగా పొందవచ్చు. మీరు తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంఐలో కొంత భాగాన్ని చెల్లించడానికి అద్దె ద్వారా వచ్చే ఆదాయం సహాయపడుతుంది.

జీఎస్టీకి చెల్లించే మొత్తాన్ని పొదుపు చేసుకోండి:

నిర్మాణంలో ఉన్న ఆస్తిపై 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీనిని ఆస్తి విలువ పైన వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒకవేళ మీరు రూ. 60 లక్షల విలువచేసే ఒక నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, జీఎస్టీ కింద రూ. 7.2 లక్షలను చెల్లించాల్సి ఉంటుంది. అదే వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేసినట్లయితే, దానిపై జీఎస్టీ వర్తించదు.

తక్షణ పన్ను ప్రయోజనం:

ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, సెక్షన్ 80 సీ కింద రుణగ్రహీత రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపును పొందుతాడు. అలాగే సెక్షన్ 24 (బీ) కింద వడ్డీ చెల్లింపులపై రూ. 2 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందుతారు.

అయితే, ఇక్కడ ఒక నిబంధన ఉంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత, అలాగే రిజిస్ట్రేషన్ కూడా పూర్తై ఉండి, యాజమాన్య పత్రాలను పొందిన తరవాత మాత్రమే మీరు ఈ పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోగలరు. ఒకవేళ ఈ విధంగా చేయకపోతే మీరు పన్ను ప్రయోజనాలను పొందలేరు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly